తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషాద ఘటన కలకలం రేపింది. ఇందులో వ్యక్తుల కంటే వ్యవస్థల వైఫల్యం స్పష్టం. టీటీడీ తో పాటు పోలీస్ శాఖ సమన్వయం..మొత్తం మీద ప్రభుత్వ వైఫల్యం. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆయన అసలు ఎవరికోసం పని చేస్తున్నారో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక సారి మాట్లాడారు అంటే ఏదో ఆవేశంలో ..లేదా పొరపాటున మాట్లాడారు అనుకోవచ్చు.
కానీ పదే పదే ఆయన చేస్తున్న విమర్శలు ప్రభుత్వ పరువు తీయటం కాకుండా...పాలన అంటే ఏదో సినిమాల్లో ఉన్నట్లే ఉంటుంది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అధికార వర్గాల్లో కూడా దుమారం రేపుతోంది. తాజాగా తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన చేసినా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఈ ప్రసంగాలకు సమాధానం ఉందా?.
1. తిరుమల లో విఐపీలపై కాదు..సామాన్య భక్తులపై దృష్టి పెట్టాలి అని చెపుతున్న
ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ రోజుకు ఎన్ని టీటీడీ సిఫారసు లెటర్లు ఇస్తున్నారు. జనసేన తరపున ఎంత మందికి సిఫారసు లేఖలు ఇస్తున్నారు. ఆ లెక్కలు బయటపెట్టగలరా?
2 . విఐపీ సంస్కృతి కట్టడి చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ..మంత్రులు కాదా?.
3 . ఈ విషయం ఎప్పుడైనా కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారా?. ఇవి ప్రెస్ మీట్ లో చెపితే అయ్యే పనులా?
4 . గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ కు జనసేన తరపున క్యాబినెట్ లో ఉన్న కందుల దుర్గేష్ ను, జిల్లా అధికారులను పంపి ఏర్పాట్లు చేయించినట్లు ...తిరుమల వైకుంఠ ఏకాదశి కి కూడా ఏర్పాట్లు చేయాలని మీరు ముఖ్యమంత్రి కి ఏమైనా చెప్పారా?
5 . టీడీపీ నేతల కంటే ఎక్కువగా చంద్రబాబు అనుభవం..పరిపాలన నైపుణ్యం చూసే మద్దతు ఇస్తున్నట్లు చెప్తున్న, పొగుడుతున్న పవన్ కళ్యాణ్ మరి తాజా ఘటన పై ఏమంటారు?.
6 . చంద్రబాబు కే ఎంతో అనుభవం ఉంది అని పొగుడుతూ...ఇప్పుడు పరిపాలనలో ఆరు నెలల అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం కు సూచనలు చేస్తారా?. అంటే మరి అంతకు ముందు చెప్పిన మాటలు?.
7. తిరుమల ఘటనలో తప్పు ఎవరిది అయినా ఈఓ , అదనపు ఈఓ, కలెక్టర్ పై చర్య తీసుకోవాల్సిందే. కానీ ఈ ప్రమాదం విషయంలో హైందవ ధర్మం అనే అంశం ఎందుకు తెచ్చినట్లు?.
8 . బుడమేరు వరదల సమయంలో లక్షల మంది నిరాశ్రయులు అయినా..ఏకంగా ముప్పై మంది చనిపోయినా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు. అప్పుడు చెప్పిన ఇబ్బందుల కారణాలు ఇప్పుడు లేవా?.
9 . కొండ కోనల్లో ట్రైబల్ ఏరియా లకు కూడా వెళుతున్న పవన్ కళ్యాణ్ కొన్ని సార్లు మాత్రమే బయటకు వచ్చి ఒక ఎజెండా ప్రకారం ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారా ? అనే అనుమానాలు టీడీపీ నేతల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి.