ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రాష్ట్ర పరిపాలనకు ప్రధానాధికారి. పాలనా అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతుంది. ఇంతటి కీలక పదవిలో ఉన్న వ్యక్తి అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ...రాష్ట్ర విభజన తర్వాత కానీ ఇంతగా పరువు పోగుట్టుకున్న వారు మరొకరు లేరు అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ వర్గాల్లో సాగుతోంది. సిఎస్ లపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భూముల విషయంలోనే అదికూడా. కానీ ఒక సిఎస్ బినామీలతో వందల ఎకరాలు...అది కూడా అసైన్ మెంట్ భూములు దక్కించుకున్నారు అని ఇంతా బహిరంగంగా ఆరోపణలు వచ్చిన దాఖలాలు అయితే లేవు అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన బినామీలతో విశాఖపట్నం జిల్లాలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాలను దక్కించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అసైన్ మెంట్ భూములు అమ్ముకోవటానికి వీలుగా లబ్దిదారులకు వీటిపై పూర్తి హక్కులు కలిపించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విషయం జవహర్ రెడ్డి కి అందరికంటే ముందే తెలుస్తుంది. ఇదే అదనువుగా జగన్ సర్కారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన అత్యంత కీలకమైన విశాఖపట్నం జిల్లాలోని భూములపై కన్నేసి కథ నడిపించినట్లు జవహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదే విషయంలో విశాఖపట్నానికి చెందిన జన సేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవలే సిఎస్ జవహర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. బినామీల పేరుతో జవహర్ రెడ్డి 800 ఎకరాలు కాజేశారు అని ఆరోపించారు. వీటి విలువే వేల కోట్ల రూపాయలు ఉంటుంది అని తెలిపారు. దీనిపై స్పందించిన సిఎస్ జవహర్ రెడ్డి ఈ ఆరోపణలు ఖండిస్తూ ప్రకటన విడుదల చేస్తూ మూర్తి యాదవ్ పై వ్యక్తిగతంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ప్రకటించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకుని మూర్తి యాదవ్ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను అని..విచారణకు ఆదేశిస్తే ఇంకా మరిన్ని విషయాలు బయటపెడతాను అని చెప్పటంతో ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఇరకాటంలోకి పడినట్లు అయింది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రంజుగా మారే అవకాశం ఉంది అని చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం జవహర్ రెడ్డి బినామీలు ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో భారీ డీల్స్ చేసినట్లు చెపుతున్నారు. ఉమేష్, త్రిలోక్ అనే పేర్లు ఉన్న వాళ్ళు సిఎస్ తరపున వైజాగ్ లో ఈ లావాదేవీలు జరిపినట్లు అక్కడ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే గత కొంత కాలంగా చేతులు మారిన...ఒప్పందాలు జరిగిన భూమి మొత్తం వెయ్యి ఎకరాల వరకు ఉంటుంది అని చెపుతున్నారు. మరో వైపు సిఎస్ పై ఈ తరహా ఆరోపణలు వస్తుంటే ఇదే తరహాలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఇదే తరహాలో వందల ఎకరాల అసైన్ మెంట్ భూములు విశాఖ జిల్లాలో దక్కించుకున్నట్లు చెపుతున్నారు. వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు అంతా సేఫ్. ప్రచారం జరుగుతున్నట్లు కూటమి అధికారంలోకి వస్తే వస్తే మరి ఈ అక్రమ దందాలపై విచారణ జరిపిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.