చంద్రబాబు కేసు ల కోసం రాజీ పడ్డారు అని విమర్శించి..నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రం నుంచి విభజన చట్టంలోని హామీలను సాదించలేకపోయినా జగన్ సక్సెస్ అనే చెప్పాలి. రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని లెక్కలు చెప్పుకుంటూ ... పెద్ద వర్షం వస్తే చాలు చెరువులుగా మారే ప్రాంతాలను దీనికి ఎంపిక చేసినా అందరూ ఒకే అనాలి.చివరకు సొంత జిల్లాకు రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ ను కూడా కేంద్రం నుంచి సాదించుకోలేని స్థితి. తెలంగాణతో అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల పంపకం విషయాలు అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం విషయానికి వస్తే జగన్ కు ముందు...జగన్ వచ్చాక అన్న చందంగా మారిపోయిన పరిస్థితి. కీలక బ్రాండ్స్ అన్నీ మాయం అయి....కొత్త కొత్త బ్రాండ్స్ తెరమీదకు తెచ్చి ...దశల వారీ మధ్య నిషేధ హామీకి జగన్ తూట్లు పొడిచారు. అయినా ఎవరూ ఏమి అడగొద్దు. భోగాపురం ఎయిర్ పోర్ట్ లో స్కాం ఉంది అని విమర్శలు చేసి...మళ్ళీ ఏ కంపెనీ పై అయితే ఆరోపణలు గుప్పించారో అదే జీఎంఆర్ కే ప్రాజెక్ట్ కే కట్టబెట్టారు. జగన్ ప్రతి పక్షంలో ఉండగా పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ అని గగ్గోలు పెట్టి..ఇప్పుడు అయన మాత్రం అంతకంటే ఎక్కువ పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఇక ప్రచారం విషయానికి వస్తే అటు ప్రకటనల దగ్గర నుంచి ప్రతి పథకానికి ముందు తన పేరు తగిలించుకోవటం ద్వారా దేశంలో ఏ ముఖ్యమంత్రి పేరుపై లేనన్ని పథకాలు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పేరుపైనే ఉన్నాయని చెప్పాలి.