వాస్తవానికి ఏపీలో ఎప్పుడో విడుదల కావాల్సిన జాబ్ క్యాలండర్ కరోనా కారణంగా ఆలశ్యంగా విడుదల అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఈ క్యాలండర్ ను విడుదల చేశారు. ఈ క్యాలండర్ ను 2021-22 సంవత్సరంలో అమలు చేయనున్నారు. ఈ క్యాలెండర్ విడుజదల సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ '' ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశాం. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మినిమమ్ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాం. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని అన్నారు.