ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు వివిధ పథకాల కింద రైతుల ఖాతాల్లోకి 2190 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నావడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఈ నిధులు జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మంత్రులు..అధికారులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు.
'గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిందని వ్యాఖ్యానించారు. . కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని'' సీఎం తెలిపారు.