విమానాలు రాని రన్ వేతో ఉపయోగం ఏంటి ?!

Update: 2023-05-04 10:27 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సినిమాలు చూపించటంలో తాను ఏ మాత్రం వెనుకాడేది లేదు అంటున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. 2022 జనవరి లో సీఎం జగన్ ఒక సమీక్షలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఎయిర్ పోర్ట్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. విమానాశ్రయాల సంగతి ఏమో కానీ రోడ్లు దారుణంగా ఉన్నాయనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టెండర్లు ఖరారు అయి...చాలా వరకు భూసేకరణ పూర్తి చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంఖుస్థాపన చేయటానికే సీఎం జగన్ కు నాలుగేళ్లు పట్టింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన సమయంలో కూడా జగన్ రాష్ట్ర ప్రజలకు కొత్త సినిమా చూపించే ప్రయత్నం చేశారు. అదేమిటి అంటే 2026 నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రారాజు అయినా ఏ 380 డబల్ డెక్కర్ విమానాలు దిగేలా డెవలప్ చేస్తామన్నారు. ఈ విమానాశ్రయంలో ఏ 380 విమానాలు దిగేందుకు అనువైన కోడ్ ఎఫ్ రన్ వే ఉండటం వేరు...ఆ విమానాలు రావటం వేరు. అసలు ఆంధ్ర ప్రదేశ్ కు ఇప్పుడు ఉన్న ఎయిర్ ట్రాఫిక్ ఎంత...వచ్చే మూడేళ్ళలో పెరిగేది ఎంత. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2 .10 కోట్ల మంది ప్రయాణించిన హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ఇప్పటి వరకు ఒక్క ఏ 380 విమాన సర్వీసులు లేవు.

                                     దేశ ఐటి రాజధానిగా ఉన్న బెంగళూరు విమానాశ్రయం నుంచి కూడా గత ఏడాది చివరిలో ఎమిరేట్స్ ఏ 380 సర్వీస్ లను ప్రారంభించింది. దేశం నుంచి ప్రస్తుతం ఏ 380 విమాన సర్వీస్ లు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి మాత్రమే ఉన్నాయి. బెంగళూరు లో అయితే వారానికి కొన్ని సర్వీస్ లు మాత్రమే నడుస్తాయని ప్రకటించారు. కొన్ని ఏ 380 విమానాల్లో ఒకే సారి 509 మంది ప్రయాణించడానికి వీలు ఉంటుంది...గరిష్టంగా 853 మంది ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేశారు. ఇందులో ఓపెన్ బార్ తో ఎన్నో విలాసంవతమైన సౌకర్యాలు ఉంటాయి. అందులో ఉండే సౌకర్యాల ఆధారంగా సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇంతవరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచే లేని ఏ 380 విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. తక్కువలో తక్కువ కనీసం ఒక దశాబ్దం పాటు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఏ 380 గురించి ఆలోచన చేయటం కూడా వేస్ట్ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి అసలు ఏ 380 ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయో కూడా క్లారిటీ లేదు. కానీ జగన్ మాత్రం భోగాపురం విమానాశ్రయం శంఖుస్థాపన సమయంలో ఏ 380 రన్ వే ల గురించి ప్రస్తావించటం అధికారుల్లో హాట్ టాపిక్ గా మారింది. నేతలు ప్రజలకు సినిమాలు చూపించటంలో ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు . 

Tags:    

Similar News