సమాచార శాఖ ఫుల్ పేజీ యాడ్ లో వింత
పథకం ఏదైనా పేజీలకు పేజీలు యాడ్స్ సర్వసాధారణం అయ్యాయి ఏపీలో. మంగళవారం నాడు మరోసారి జాకెట్ యాడ్స్ దర్శనం ఇచ్చాయి. ఇందులో వింత ఏమీలేదు...ఒక వేళ యాడ్స్ ఇవ్వకపోతే వార్త అన్నట్లు తయారైంది పరిస్థితి ఇప్పుడు. రాష్ట్రం ఎన్ని ఆర్ధిక కష్టాల్లో ఉన్నా కూడా ఈ యాడ్స్ హంగామా మాత్రం ఆగటంలేదు. ఇది అంతా ఒకెత్తు అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే యాడ్స్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకునే తీరిక లేకుండా ఉన్నారు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు. ముఖ్యమంత్రి పేరుతో విడుదల అయ్యే యాడ్స్ ను స్వయంగా కమిషనర్ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది.
కానీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కానీ..ఆ శాఖ అధికారులకు అదేమీ పట్టినట్లు లేదు. ఫుల్ పేజీ తెలుగు యాడ్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును జగన్ మెహన్ రెడ్డిని చేసిపడేశారు. కానీ అదే పేజీ కింద భాగంలో మాత్రం సరిగానే రాశారు. అయితే సీఎం యాడ్ విషయంలోనే సమాచార శాఖ అధికారులు..సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు విషయాల్లో సమాచార శాఖ తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును కూడా విచిత్రంగా మార్చేసి యాడ్స్ ఇచ్చేశారు. ఇది ఆ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఓ ఐఏఎస్ అదికారి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి పత్రికతోపాటు ఈనాడు పత్రికల్లో కూడా ఇదే తరహాలో యాడ్ ప్రచురించారు.