వైసీపీ డిఫెన్స్ ఆట వెనక స్టోరీ ఏంటో!

Update: 2023-10-10 04:51 GMT

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు డిఫెన్సులోకి వెళ్లిపోయారు. చంద్రబా బాబు అరెస్ట్ అంశం రాజకీయంగా తనకు నష్టం చేస్తుంది అని భయపడుతున్నారా?. లేక మరేదైనా కారణం ఉందా?. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జగన్ మౌత్ పీస్ సజ్జల రామకృష్ణ రెడ్డి పక్కా ఆధారాలతోనే సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు అని చెప్పారు. తర్వాత ఆయనే కొంత కాలానికి చంద్రబాబు అరెస్ట్ కు ప్రభుత్వానికి సంబంధం లేదు అంటూ మాట్లాడారు. సిఐడి ప్రభుత్వంలో భాగం కాదా? అసలు దేశంలో అత్యంత కీలకమైన విచారణ సంస్థలు అయిన సిబిఐ, ఈడీ లు ఎలా పనిచేస్తున్నాయో అందరూ చూస్తున్నాడు. అలాంటిది సిఐడి ప్రభుత్వంతో సంబంధం లేకుండా పనిచేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా?. సీఎం జగన్ సోమవారం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పై తనకు కక్ష లేదు అని...ఈ అరెస్ట్ కూడా తాను దేశంలో లేనప్పుడు...లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఒక్క లండన్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారం క్షణాల్లో చేరవేయగలిగే వ్యవస్థలు ఉన్న ఈ రోజుల్లో నేను లండన్ లో ఉన్నా.. నాకు తెలియదు అంటే ఇంతకంటే పెద్ద కామెడీ మరొకటి ఉండదు అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ కామెంట్స్ వైసీపీ డిఫెన్సె లో పడిపోయింది అనే సంకేతాలు పంపుతుంది అనే చర్చ సాగుతుంది. చంద్రబాబు అవినీతిపై గతంలో ప్రధాని మోడీ కామెంట్స్ చేసారని కూడా జగన్ చెప్పుకొచ్చారు. మరి ఈ మద్యే జగన్ అవినీతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా లు కూడా ఆంధ్ర ప్రదేశ్ వేదికగా మాట్లాడారు.

                                               ఇసుక దగ్గర నుంచి మద్యం, భూములు ఇలా ప్రతిదాంట్లో స్కాం లే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వాటిని కూడా జగన్ ఒప్పుకుంటారా?. మరో కీలక విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ పెట్టింది 2014 ఎన్నికలకు ముందే. అంటే ఇంకా నిండా పదేళ్లు కూడా కాలేదు. కానీ సీఎం జగన్ మాత్రం పవన్ జనసేన పెట్టి పదిహేను సంవత్సరాలు అయింది అంటూ మీటింగ్ లో చెప్పుకొచ్చారు. ఆ పార్టీ కి నియోజకవర్గాల్లో నాయకులు లేరు...జెండా కట్టే కార్యకర్తలు లేరు అంటూ ఎద్దేవా చేశారు. కాసేపు అదే నిజం అనుకుందాం. అలాంటప్పుడు 151 అసెంబ్లీ సీట్లు , 22 లోక్ సభ ఎంపీలను కలిగి ఉన్న వైసీపీ జనసేన ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. జగన్ దగ్గర నుంచి వైసీపీ మంత్రులు అందరూ నిత్యం జన సేన ను, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది?. తమకు పొత్తులు అవసరం లేదు అని జగన్ ప్రకటించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అధికారంలో ఉన్న పార్టీ తో కలవటానికి ఆసక్తి చూపే పార్టీ ఒక్కటి కూడా లేదు ఆంధ్ర ప్రదేశ్ లో . సహజంగా అధికారంలో ఉన్న పార్టీ కి ఉండే ఆర్థిక వనరులు తదితర అంశాలు ఆధారంగా చిన్న చిన్న పార్టీలు అటు వైపు చూస్తుంటాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు అనే చెప్పాలి. మొత్తానికి జగన్ చెప్పిన లండన్ కథ తో పాటు జనసేన పై జగన్ చేసిన కామెంట్స్ చూసి ఇది ఏదో ట్రాక్ తప్పుతున్నట్లే ఉంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

Tags:    

Similar News