కుప్పం లోనూ మంగళగిరి క్యాసెట్ వేసిన జగన్

Update: 2024-02-26 14:08 GMT

Full Viewనారా లోకేష్ ను ఓడిస్తే నా క్యాబినెట్ లో ఆళ్ల రామ కృష్ణారెడ్డి కి మంత్రి పదవి ఇస్తా. ఇది గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి బహిరంగ సభలో ఇచ్చిన హామీ. ఆయన కోరినట్లే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచారు. నారా లోకేష్ ఓడిపోయారు. కానీ ఐదేళ్ల కాలంలో జగన్ తాను ఇచ్చిన మంత్రి పదవి హామీని నిలబెట్టుకోలేదు. పైగా మంగళగిరి అభివృద్ధికి హామీ ఇచ్చిన నిధులు కూడా ఇవ్వలేదు అని అలిగి బయటకు పోయిన రామకృష్ణా రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే క్యాసెట్ కుప్పంలో కూడా వేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ ను గెలిపిస్తే ఆయనకు తన మంత్రి వర్గంలో చోటు కలిపిస్తానని ప్రకటించారు. కుప్పానికి చంద్రబాబు ఏమి చేయలేదు అన్ని తానే చేశానని జగన్ సోమవారం నాడు కుప్పం పర్యటన సంధర్భంగా ప్రకటించారు. ఇంతకాలం చంద్రబాబు ను భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు అంటూ వ్యాఖ్యానించారు జగన్. ఆయన చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో జగన్, భరత్ గెలిస్తే కుప్పానికి మంత్రి పదవి మాత్రమే దక్కుతుంది. కానీ లెక్క మారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే అదే కుప్పానికి ఏకంగా ముఖ్యమంత్రి పదవే దక్కుతుంది కదా?.

                                                 మరి కుప్పం ప్రజలు మంత్రి పదవి వైపు చూస్తారా...లేక ముఖ్యమంత్రి పదవి వైపు చూస్తారా?. టీడీపీ, జనసేన పొత్తు సాఫీగా ఫైనల్ కావటంతో వైసీపీ నేతలు ఉలికిపాటుకు గురవుతున్నారు. జనసేన కు దక్కిన సీట్ల విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , జనసేన నాయకుల కంటే వైసీపీ మంత్రులు...నేతలు ఎక్కువ గుండెలు బాదుకుంటున్నారు అంటే వాళ్ళ టెన్షన్ ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. ఇది అంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు అనే విషయం రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకు అయినా అర్ధం అవుతుంది. జనసేన నాయకులను..క్యాడర్ ను రెచ్చకొట్టి పొత్తులో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయించి ..ఎక్కువ సీట్లలో ఆ పార్టీ ఓటమి పాలు అయితే...రాజకీయంగా అది తమకు లాభం చేకూరుస్తుంది అన్నది వైసీపీ, జగన్ అండ్ కో ప్లాన్ అన్న విషయం తెలిసిందే. అందుకే సీట్ల నంబర్ ఖరారు కాగానే వైసీపీ పార్టీ మొత్తం ఊగిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ నేతల రియాక్షన్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇది అర్ధం అవుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్నీ పదే పదే ప్రచారం చేయటం ద్వారా క్యాడర్ ను రెచ్చగొట్టి ఓట్ల బదిలీ ప్రయత్నాలను అయినా కొంత మేర అయినా దెబ్బ కొట్టే పనిలో వైసీపీ, ఆ పార్టీ నాయకులూ ఉన్నారు. మారి ఎవరి ప్లాన్స్ వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News