పాల‌న‌లో జ‌గ‌న్ ఫెయిల్

Update: 2021-11-27 11:37 GMT

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించిన ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. సీఎంగా ప‌రిపాల‌న‌లో జ‌గ‌న్ ఇంత ఘోరంగా విఫ‌లం అవుతార‌ని తాను ఊహించ‌లేద‌న్నారు. మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌రించుకుని మ‌ళ్ళీ పెడ‌తామ‌ని చెప్ప‌టం కూడా ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కింద‌కే వ‌స్తుంద‌న్నారు. ఆయ‌న శ‌నివారం నాడు రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడారు. అప్పుల‌పై ప్ర‌భుత్వానికి నియంత్ర‌ణ లేకుండా పోయింద‌ని..ఇది ప్ర‌మాద‌క‌ర సంకేతంగా పేర్కొన్నారు. రెండేళ్ళ‌లోనే వైసీపీ ప్ర‌భుత్వం మూడు ల‌క్షల కోట్లు అప్పులు చేసింద‌ని తెలిపారు. ఏపీలో ఇసుక‌, మ‌ద్యం, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు అన్నీ పెంచుకుంటూ పోతున్నార‌ని..అయినా అప్పులు మాత్రం అమాంతంగా పెరుగుతున్నాయ‌న్నారు. అయినా రాష్ట్రంలో కొత్త‌గా ఆస్తులు ఏమీ ఏర్ప‌డ‌టం లేద‌ని త‌ప్పుప‌ట్టారు. అధికారంలో ఉన్నంత కాలం అప్పులు చేసి త‌ర్వాత రాష్ట్రాన్ని రోడ్డున ప‌డేస్తారా? అని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై గ‌ట్టిగా అడ‌గ‌టానికి కేసుల భ‌యం అని..ఐఏఎస్ అధికారులు సైతం ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూసి నిర్ఘాంత‌పోతున్నార‌ని తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనందునే వరుసగా గెలుస్తూ వస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బాగా పరిపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. జగన్‌ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..? అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో సంబంధంలేని అంశాలపై చర్చ జరిగిందని.. అసలు విపక్షం లేకుండా అసెంబ్లీలో ఏం చర్చిస్తారు? అని జగన్ సర్కార్‌ను ఉండవల్లి ప్రశ్నించారు. విపక్షం లేని అసెంబ్లీనా.. ఇదేం సంప్రదాయం..? ఇంత ఏకపక్షంగా అసెంబ్లీ జరగడం వల్ల ఏం లాభం..? అని వైసీపీ ప్రభుత్వం ఉండవల్లి ప్రశ్నల వర్షం కురిపించారు. మీ వ్యాపారాలకు సంబంధించిన అప్పులు తీర్చుకొని రాష్ట్రంలో మాత్రం అప్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గుండె మీద చేయి వేసుకొని అవినీతి రహిత పాలనపై మాట్లాడగలరా..?. ఏపీలో ప్రతీ విషయంలోనూ అవినీతి జరుగుతోంద‌న్నారు.

Tags:    

Similar News