ముగిసిన సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

Update: 2021-06-11 09:57 GMT

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. తొలి రోజు కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్, కేంద్ర హోం శాఖ‌ల మంత్రి అమిత్ షాల‌తో భేటీ అయి పోల‌వ‌రం, రాష్ట్ర హైకోర్టు క‌ర్నూలుకు త‌ర‌లింపుతోపాటు మూడు రాజ‌ధానుల అంశంపై చ‌ర్చించారు. దీంతోపాటు కేంద్రం వ‌ద్ద పెండింగ్ లో నిధుల కేటాయింపు, పోల‌వ‌రం అంచ‌నాల పెంపు అంశంపై చ‌ర్చించారు. శుక్ర‌వారం నాడు సీఎం జ‌గ‌న్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో స‌మావేశం అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి ఆయ‌న‌కు వివరించారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం లేకుండా చూడాలన్నారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు.

వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు వచ్చిందన్నారు. 2002-15 మధ్య స్టీల్‌ప్లాంట్‌ మంచి పనితీరు కనబరిచిందని కేంద్రమంత్రికి సీఎం జగన్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో 19,700 ఎకరాల భూమి ఉందని, స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని వివరించారు. గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014-15 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలను సీఎం సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో కేంద్ర శాఖలతో కలిసి పనిచేస్తామని సీఎం అన్నారు. కేంద్ర మంత్రి ప్ర‌ధాన్ తోపాటు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశం అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. 2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న సీఎం జగన్‌.. సకాలంలో రైతులకు పేమెంట్లు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News