ఆ విధాన నిర్ణయం సంగతి కాసేపు పక్కన పెడితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన బ్రాండ్స్ విషయంపై జరిగిన చర్చ బహుశా ఏ అంశంపై కూడా జరిగి ఉండదు అనే చెప్పొచ్చు. మే 13 న జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మద్యం బ్రాండ్స్ విషయం కూడా ఒక ప్రధాన అంశంగా మారబోతుంది అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న కీలక కంపెనీల బ్రాండ్స్ అన్నింటిని మాయం చేసి...కొత్త కొత్త బ్రాండ్స్ మద్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ద్వారా అమ్మించారు. అవి కూడా అత్యంత నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చివరకు పరిస్థితి ఎంతగా మారిపోయింది అంటే ప్రతిపక్ష కూటమి తాము అధికారంలోకి వస్తే గతంలో ఉన్న బ్రాండ్స్ ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది.
ఎందుకంటే నిజంగానే మందు బాబులు జగన్ అందుబాటులోకి తెచ్చిన వెరైటీ బ్రాండ్స్ తో ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు అనే విషయం ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరిని అడిగినా కూడా చెపుతారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రభుత్వం అమ్మే మద్యం షాప్ ల్లో ఎలాంటి డిజిటల్ చెల్లింపులు అనుమతించకుండా కేవలం నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా జగన్ సర్కారు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఐదేళ్లు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కారు..ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం మాఫియా నడుస్తోంది అని ఆరోపిస్తోంది. అది కూడా స్వయంగా ప్రధాని మోడీనే ఈ ఆరోపణలు చేయటం విశేషం. జగన్ తన ఐదేళ్ల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఏ మేరకు పెంచారో తెలియదు కానీ...మద్యం విషయంలో మాత్రం ఆయన ‘ఏపీ బ్రాండే’ మార్చేశారు అని చెప్పొచ్చు.