ప్రజలకు సంపద ఏమో కానీ..కంపెనీలకు మాత్రం కాసుల వర్షం

Update: 2025-05-21 04:53 GMT

జగన్ కట్ చేసిన ఐదు వందల ఎకరాలు వెనక్కి

అప్పుడు లాభదాయకం అయింది...చంద్రబాబు రాగానే కాకుండా పోయిందా!

భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో అందరూ అందరే

సంపద సృష్టి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నోటి నుంచి పదే పదే వచ్చే మాట . గత ఏడాది కాలంలో ఆయన రాష్ట్ర ప్రజలకు ఎంత సంపద సృష్టించారో తెలియదు కానీ..ఇదే కాలంలో అస్మదీయ కంపెనీలకు...బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం పెద్ద ఎత్తున సంపద సృష్టించి పెట్టారు..ఇందుకు రాజమార్గాలు వేసిపెట్టారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అదే కోవలోనే ఇప్పుడు మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన సమావేశం అయిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే జీఎంఆర్ కు కేటాయించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ లో జగన్ హయాంలో కట్ చేసిన 500 ఎకరాలను తిరిగి ఆ సంస్థకు కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూ కేటాయింపులను 2700 ఎకరాలను 2200 ఎకరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కంపెనీ అడిగింది అని చెప్పి మంత్రి వర్గం దానికి ఓకే చెప్పేసింది.

                                                        అసలు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను జీఎంఆర్ కు కేటాయించటంపైనే పెద్ద ఎత్తున వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చంద్రబాబు తొలి టర్మ్ లో ఈ ఎయిర్ పోర్ట్ కోసం పోటీ బిడ్డింగ్ కు టెండర్లు పిలవగా ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇండియా (ఏఏఐ) ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. ప్రభుత్వానికి ఈ విమానాశ్రయం ద్వారా వచ్చే ఆదాయంలో కూడా అధిక మొత్తం ఇవ్వటానికి ముందుకొచ్చింది. అయినా కూడా అప్పటి చంద్రబాబు సర్కారు ఏఐఐ కి దక్కిన టెండర్ ను రద్దు చేస్తూ మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకుంది. దీనికి చూపించిన కారణాలు భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఎం ఆర్ఓ ఫెసిలిటీ తో పాటు మరికొన్ని సౌకర్యాలు జత చేసి టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. కేవలం ఏఐఐ టెండర్ రద్దు చేయటం కోసమే ఈ అంశాలను తెర మీదకు తెచ్చారు. తర్వాత మరిన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఏ ఐఐ టెండర్ రద్దు చేసిన తర్వాత పిలిచిన బిడ్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇందులో పాల్గొనే అనుమతి లేదు అనే నిబంధన పెట్టడం అప్పటిలో పెద్ద కలకలం రేపింది . ఇది అంతా కూడా జీఎంఆర్ కోసమే చేశారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఏఐఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు కూడా జాతీయ మీడియా లో వార్తలు వచ్చాయి.

                                                    తర్వాత పిలిచిన టెండర్లలో చంద్రబాబు కోరుకున్నట్లు జీఎంఆర్ కే ప్రాజెక్ట్ దక్కింది. అయితే ఏఐఐ తో పోలిస్తే ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (యూడీఎఫ్) లో ప్రభుత్వానికి ఇచ్చే వాటా అతి తక్కువగా ఉండటంతో పాటు కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఇది చెల్లించేలా ఉండటంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా సరే అప్పటి చంద్రబాబు సర్కారు ఈ విషయంలో ముందుకే వెళ్ళింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది పెద్ద స్కాం అని ఆరోపించిన వైసీపీ..జగన్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్ట్ కు కేటాయించిన భూమిలో ఒక ఐదు వందల ఎకరాలు తగ్గించి ఇదే సంస్థను కొనసాగించారు. ఇప్పుడు జగన్ తగ్గించిన ఐదు వందల ఎకరాలు కూడా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు అప్పగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవే కాదు అప్పటిలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంచనా వ్యయాలు కూడా అడ్డగోలుగా పెంచారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. సహజంగా ప్రజలపై ..విమాన ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థ ఏఐఐ లాంటి వాటికే టెండర్ ఇవ్వాలి. కానీ ఏఐఐ కి దక్కిన టెండర్ ను రద్దు చేసి మరీ జీఎంఆర్ కే ప్రాజెక్ట్ దక్కేలా చేయటంలో చంద్రబాబు తన వంతు పాత్ర పోషించి ప్రైవేట్ కంపెనీ ల సంపద పెంచటం కోసం కృషి చేశారు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అప్పుడు జీఎంఆర్ కు టెండర్ దక్కేలా చేయటంతో పాటు జగన్ రద్దు చేసిన భూమిని తిరిగి ఆ కంపెనీ కి కేటాయించటం ద్వారా చంద్రబాబు ఆ కంపెనీ కి జీ హుజూర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News