చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

Update: 2021-03-16 03:45 GMT

విచారణ హాజరు కావాలని ఆదేశం

ఏపీ సర్కారు దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడే ఏజెండాగా రంగంలో దిగింది. అమరావతి భూముల అక్రమాలకు సంబంధించి చంద్రబాబునాయుడికి సీఐడీ మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అధికార వైసీపీ భూ అక్రమాలకు సంబంధించి పలు కేసులు పెట్టడంతోపాటు...తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కూడా అమరావతి భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేల్చింది. ఆ తర్వాత సిట్ వేయగా..దీనికి కోర్టుల్లో బ్రేకులు పడ్డాయి. ఈ తరుణంలో ఏపీ సీఐడి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి పి. నారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు.

                                                      41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానిక వచ్చి అధికారులు ఈ నోటీసులు అందించారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు  ఇచ్చినట్లు సమాచారం. అయితే అమరావతిలో అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో సీఐడీ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిబంధనల ప్రకారం అసైన్ మెంట్ భూముల లావాదేవీలకు అనుమతించరు. అయితే అమరావతి విషయంలో అసైన్ భూములు కొనుోగులు చేసిన వారి దగ్గర నుంచి పూలింగ్ లో భూములు తీసుకుని ప్రభుత్వపరంగా ఇచ్చే అన్ని ప్రయోజనాలు వారికి కల్పించారు. ఈ మేరకు ఒక సారి అసైన్ మెంట్ భూముల లావాదేవీలకు మినహాయింపులు ఇస్తూ జీవో జారీ చేశారు. అయితే దీనికి కేబినెట్ ఆమోదం లేకపోవటం వంటి కారణాలతో పాటు ఉద్దేశపూర్వకంగా వారికి అనుచిత లబ్ది కల్పించినట్లు సీఐడీ పేర్కొంది. 


Tags:    

Similar News