నిమ్మల రామానాయుడు. ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి. చంద్రబాబు ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకున్నప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తున్నారు. పని విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. తాజాగా విజయవాడ ను ముంచిన వరదల సమయంలో కూడా ఆయన బుడమేరు దగ్గర నిలబడి పనిచేయించారు. రోజుల తరబడి అక్కడే ఉన్నారు. రామానాయుడు తో పాటు కొన్ని సార్లు నారా లోకేష్, మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు లు కూడా తమ వంతు సహకరించారు. కష్టపడే విషయంలో మిగిలిన మంత్రుల కంటే నిమ్మల రామానాయుడు అందరికంటే ముందు వరసలో ఉంటున్నారు అనే చెప్పొచ్చు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలతో కష్టబడ్డ వాళ్ల విషయం వెనక్కి పోయి కామెడీ ముందుకు వచ్చినట్లు అవుతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలే. దేశంలో ఎంతటి విపత్కర పరిస్థితిని ఆయినా సాధ్యమైనంత వేగంగా చక్కబెట్టడంలో ఆర్మీ కి మంచి పేరు ఉంది.
అందుకే విపత్తులు వచ్చినప్పుడు ఆర్మీని రంగంలోకి దించుతారు. కానీ విచిత్రంగా చంద్రబాబు తాజగా చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారాయి. ఆయన బుడమేరు గండ్లు పూడ్చిన విషయంపై బుధవారం నాడు స్పందించారు. చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....‘ బుడమేరు గండ్లు పూడ్చటం కోసం ఒక యుద్ధమే చేశాం. కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు. మా వల్ల కూడా కాలేదు. మేము చాలా టెక్నాలజీ చూశాం కానీ..ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదు అని చేతులెత్తేస్తే ..కాదు అని మన వాళ్ళు నిరూపించారు. మంత్రులే దగ్గరుండి ...పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి గండ్లు పూడ్చే పని చేశారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ, మంత్రి నిమ్మల రామానాయుడు బాగా పనిచేశారు’ అంటూ ప్రశంసించారు. ఇరిగేషన్ శాఖను...మంత్రి నిమ్మల రామానాయుడుని అబినందించటంలో ఎక్కడా...ఎవరికీ వివాదం లేదు. కానీ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ..విపత్తుల సమయంలో ఆగమేఘాల మీద పని చేసే ఆర్మీ వల్ల కాక చేతులెత్తేస్తే ..మంత్రులు దగ్గరుండి పని చేయించారు అని చెప్పటమే కామెడీ గా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.