అమ‌రావ‌తి కేసుల వాయిదా..స‌ర్కారు సందేహం

Update: 2021-08-23 12:39 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌న్పించ‌టం లేదు. స‌ర్కారు మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో చ‌ట్టం చేయ‌గా..అమ‌రావ‌తి రైతులు, మ‌రికొంత మంది హైకోర్టును ఆశ్ర‌యించారు. వాస్త‌వానికి ఈ అంశంపై ఏపీ హైకోర్టు రోజువారీ విచార‌ణ చేప‌ట్టాల‌ని గ‌తంలోనే నిర్ణ‌యించింది. క‌రోనా, సీజె బ‌దిలీ త‌దిత‌ర కార‌ణాల‌తో ఇది అమ‌లుకు నోచుకోలేదు. సోమ‌వారం నాడు అమ‌రావ‌తి రాజ‌ధానుల అంశంపై హైకోర్టులో మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా పిటీష‌న‌ర్లు క‌రోనా కార‌ణంగా విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరారు. దీంతో హైకోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఈ కేసులు తేలేది ఎప్పుడు..మూడు రాజ‌ధానుల అమ‌లు జ‌రిగేది ఎప్పుడు అన్న‌ది ప్రశ్నార్ధ‌కంగా మారింది. తాజా ప‌రిణామాల‌పై ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు.

అమ‌రావ‌తిపై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదని, రాజధానిపై కేసు వేసిన పిటిషనర్లు వాయిదా అడగాల్సి అవసరం ఏమొచ్చింది..? అని ప్రశ్నించారు. వాయిదా వేయాలని అడగటంలో ఏమైనా దురుద్దేశం ఉందా?.. అనేది అర్థం కావడం లేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, అనుమానాలకు తావులేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు.

Tags:    

Similar News