ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. అది కూడా ఎన్నికల ముందు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జగన్ సర్కారుపై సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు అది జరిగే పనేనా?. మరి ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి ఇవేమి ఆలోచించకుండానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆంధ్ర ప్రదేశ్ లోని లిక్కర్ విధానంపై సిబిఐ విచారణ కోరుతూ వినతిపత్రం ఇస్తారా?. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరటి కాయలు అమ్మే బండి దగ్గర నుంచి చివరకు చిలక జోస్యం చెప్పేవాళ్ళు కూడా పేటిఎం చెల్లింపులు స్వీకరిస్తుంటే జగన్ సర్కారు మాత్రం మద్యం అమ్మకాల్లో ఒక్క నగదును మాత్రమే అనుమతిస్తోంది. ఇక్కడే ఏదో పెద్ద స్కాం ఉంది అనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అయినా సరే జగన్ సర్కారు మాత్రం అదే విధానంతో ముందుకు సాగుతోంది. ఒక వైపు కేంద్రం డిజిటల్ ప్రెమెంట్స్ ను ప్రోత్సాహస్తున్నట్లు చెప్పుకుంటున్నా...దీనిపై ఫిర్యాదులు వెళ్లినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ అద్యక్ష్యురాలు ఏకంగా సిబిఐ విచారణకు కోరితే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది విపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది.
ఇదే అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశంతో పాటు మరో పార్టీ జనసేన కూడా దీనిపై ఎన్నో విమర్శలు చేసింది. అయినా పెద్దగా ఉపయోగం లేదు. మరి ఇప్పుడు బీజేపీ నే నేరుగా కేంద్ర హోం మంత్రికి ఇదే అంశంపై ఫిర్యాదు చేయటంతో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు కీలకం కానుంది.ఈ ఫిర్యాదును కూడా బీజేపీ రాజకీయ అవసరానికి వాడుకుంటుందా లేక...నిజం గా ప్రజల కోణంలో అలోచించి విచారణకు ఆదేశిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపులర్ బ్రాండ్స్ అన్నీ మాయం అయి కొత్త కొత్త బ్రాండ్స్ తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మద్యం వినియోగదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పురందేశ్వరి ఒక మద్యం షాప్ కు వెళ్లి లావాదేవీలను పరిశీలించగా లక్ష రూపాయల అమ్మకాలు సాగగా అందులో కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే డిజిటల్ ప్రెమెంట్స్ జరిగాయని తెలుసుకుని..ఆ వివరాలను ఆమె మీడియా కు కూడా వెల్లడించారు. ఇప్పుడు మద్యం విధానంతో పాటు కొనుగోళ్లు, అమ్మకాలపై విచారణ జరపాలని ఆమె కోరారు.