ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి రికార్డు విజయాన్ని దక్కించుకోవటంతో చంద్రబాబు గతంలో చేసిన శపథం నెరవేరునట్లు అయింది. 2021 లో అప్పటి అధికార వైసీపీ కి చెందిన కొంత మంది సభ్యులు తన కుటుంభం సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని...ఏ మాత్రం గౌరవంలేని ఈ కౌరవ సభ్యలో తాను ఉండనని..మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అని ప్రకటించి బయటకు వెళ్లిన చంద్రబాబు శుక్రవారం నాడు చెప్పినట్లే ముఖ్యమంత్రిగా సభలోకి ఎంట్రీ ఇచ్చారు.
శాసనసభలో ఎమ్మెల్యేలు కూడా నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సభలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆలింగనం చేసుకున్నారు. మంత్రిగా గతంలో నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినా...ఎమ్మెల్యేగా గెలిచి సభకు రావటం ఇదే మొదటిసారి.