ఎన్నికల వరకు ఏపీ రాజధాని సంగతి తేలదు

Update: 2023-02-08 13:02 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలక పరిణామం. కేంద్రం జోక్యం చేసుకుని విభజన చట్టంలో మార్పులు చేస్తే తప్ప వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోరిక నెరవేరేలా లేదు. ఎందుకు అంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన సమాధానమే ఈ విషయం చెపుతుంది. మరో వైపు రాజకీయంగా బీజేపీ తమ విధానం అమరావతి మాత్రమే రాజధాని అని చెపుతుంది. మరి ఇప్పుడు సీఎం జగన్ కోరుకున్నట్లు మూడు రాజధానులు ముందుకు సాగటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోని సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నూతన రాజధాని నిర్మాణం అధ్యయనానికి ఏర్పాటు చేసిందని వెల్లడించింది. అధ్యయన నివేదిక తర్వాత తదుపరి చర్యలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగిందని... ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని పేర్కొంది. తర్వాత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసిఆర్ డీఏ )ని ఏర్పాటు చేశారని తెలిపారు.                      

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ విషయాలను పార్లమెంట్ లో వెల్లడించింది. తాజాగా కేంద్రం వెల్లడించిన అభిప్రాయాలు చూస్తే ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ చెప్పిన వాదనను ఇది సమర్దించినట్లు కనిపిస్తోంది. ఒక సారి రాజధానిగా అమరావతిని నిర్ణయించాక మళ్ళీ జగన్ సర్కారు తర్వాత మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లు ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పంపటం కానీ..అక్కడ ఆమోదం పొందటం కానీ ఏమి చేయలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని పేర్కొంది. ఇది ఇలా ఉంటే కేంద్రం ఈ అంశంపై ఇంత క్లారిటీ గా చెప్పాక కూడా సీఎం జగన్ వైజాగ్ వెళ్తారా....చట్టం చేయకుండా అయన అక్కడ కూర్చుంటే అది రాజధాని ఎలా అవుతుంది అన్న ప్రశ్న ఉదయించక మానదు. తాజా పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల వరకు ఈ రాజధాని గందరగోళం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Full ViewFull View

Tags:    

Similar News