న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి తలపట్టిన మహాపాదయాత్ర సోమవారం నాడు ప్రారంభం అయింది. 45 రోజుల పాటు ఇది కొనసాగనుంది. తొలుత ఈ పాదయాత్రకు ప్రభుత్వం నో చెప్పటం తో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పలు షరతులతో ఈ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతి ఏకైక రాజధానిగా ఉంచాలంటూ గత కొంత కాలంగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత అకస్మాత్తుగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అసెంబ్లీలో బిల్లులు ఆమోదింపచేసుకున్నారు. దీంతో వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో రెండున్నర సంవత్సరాలుగా రాజధానికి సంబంధించి ఎలాంటి పనులు ముందుకు సాగటం లేదు.
అటు అమరావతిలో రాజధాని నిర్మాణాలు పనులు లేవు...మూడు రాజధానుల పనులు కూడా కోర్టు స్టే కారణంగా ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర తిరుపతికి చేరుకోనుంది. డిసెంబర్ 17న ఈ మహాపాదయాత్ర ముగియనుంది. అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్నీ రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ల్యాంగ్ పూలింగ్ కింద రైతుల నుంచి భూములు సమీకరించిన విషయం తెలిసిందే. రైతులు తమ పాదయాత్రకు మద్దతుగా ప్రజలు వీలైనంత ఆర్ధిక సాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.