ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సేవలను పదవీ విరమణ తర్వాత కూడా ఉపయోగించుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఆయన ఈ నెల30న రిటైర్ కానున్నారు. ఆ తర్వాత ఆయనకు ఢిల్లీలో కేబినెట్ హోదాతో పదవి అప్పగించనున్నారు. ముఖ్యంగా ఆయన కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఏపీ తీవ్రమైన ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. కేంద్రం దగ్గర నుంచి పలు శాఖలకు సంబంధించి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు పొందేలా చూడటం, కేంద్రంతో మరింత సమన్వయం కోసం ఆదిత్యనాధ్ దాస్ సేవలను ఉపయోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే వారంలో వెలువడనున్నాయి.
ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిత్యం కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. అంతే కాకుండా సవరించిన అంచనాలకు సంబంధించి ఇప్పటివరకూ తుది ఆమోదం రాలేదు. సాగునీటి శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆదిత్యనాధ్ దాస్ అయితే ఓ వైపు పెండింగ్ లో ఉన్న పోలవరం అంశాలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన క్రిష్ణా, గోదావరి బోర్డులకు అందజేయాల్సిన డీపీఆర్ లు తదితర అంశాలను ఆయన చూసుకుంటారని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారాలతోపాటు కొన్ని సబ్జెక్టు లు కూడా ఆయనకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఉత్తర్వులు వెలువడితే కానీ ఈ విషయం స్పష్టత రాదంటున్నారు.