కరోనా కేసులు పెరుగుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం పాఠశాలలు కొనసాగించాలని నిర్ణయించటంపై టీడీపీ, జనసేనలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలాఖరు వరకూ సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై లోకేష్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. విద్యార్దుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ వ్యాప్తికి, పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.