పెట్టుబడుల సాధన విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుపై అధికారుల్లోనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించి...నిజంగా ఉద్యోగాలు కల్పిస్తే వాటిని అందరూ హర్షిస్తారు. అయితే రాష్ట్రంలోని కూటమి సర్కారు కొన్ని ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు కారణం అవుతోంది అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంపెనీ నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చింది అంటే చాలు వెంటనే వాటిని ఆమోదించి...రాష్ట్రానికి పెట్టుబడుల వరద..ఉద్యోగాల వెల్లువ అనే అంశంపై ప్రచారం చేసుకోవడంపైనే ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది తప్ప...నిజంగా శాస్త్రీయ పరిశీలన చేయకుండానే అనుమతులు మంజూరు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ లో ఎస్ఏఎఫ్ వన్ ఇండియా ఎస్ పీ కంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ కోసం అంటూ 45 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీ 1835 కోట్ల రూపాయల పెట్టుబడితో 2500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది అని పేర్కొన్నారు.
ఎస్ఐ పీబి ఆమోదంతో ఈ కంపెనీ కాకినాడ లో 45 ఎకరాల భూమిని లీజ్ కు ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. భూ కేటాయింపు తర్వాత 15 నెలల్లో కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాల్సి ఉంటుంది అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయిల్ బిల్లు తగ్గించుకునేందుకు పెట్రోల్ లో ఇథనాల్ ను కలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెట్రోల్ వినియోగం పై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల కార్లు..ఇతర వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయనే భయం కూడా వినియోగదారుల్లో వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమి ఉండదు అని తోసిపుచ్చుతోంది. ఇది ఒకటి అయితే ఎలా అయితే కార్లు..ఇతర వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వినియోగిస్తున్నారో....అలాగే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటిఎఫ్) లో కూడా పునరుత్పాదక వ్యర్థ పదార్థాల నుండి ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయ ఇంధనమే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే 2030 నాటికి మూడు కోట్ల (30 మిలియన్ టన్నుల) టన్నుల సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్త్పతి చేసేలా 200 ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడ్డాయి.
ఈ ప్రాజెక్ట్ ల టేకాఫ్ అనుకున్న స్థాయిలో సాగటం లేదు అని..మధ్యలోనే కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి..మరి కొన్ని ప్రాజెక్ట్ ల్లో విపరీత జాప్యం జరుగుతున్నట్లు ప్రముఖ పత్రిక బిజినెస్ లైన్ తాజాగా వెల్లడించింది. చాలా ప్రాజెక్ట్ లు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని...2030 నాటికి టార్గెట్ లో కేవలం 20 మిలియన్ టన్నులకు మాత్రమే చేరుకునే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ల్లో ఉన్న సంక్లిష్టతలను గుర్తించకుండా ప్రభుత్వం ఈ సంస్థకు హడావుడిగా 45 ఎకరాల భూమి కేటాయించినట్లు కనిపిస్తోంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ ఎంత మేర టేకాఫ్ అవుతుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి సరైన విధానాలు లేకపోవటం ఒకటి అయితే...మరొకటి ఈ కారణంగానే ఆయా సంస్థలకు నిధుల లభ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది అని చెపుతున్నారు.