వైసీపీ ఎన్డీయేలో చేరబోతుందా?. సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీతో ఇదే అంశంపై చర్చించబోతున్నారా?. అంటే రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. గత కొన్ని రోజులుగా ఎన్డీయేలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఈ ఢిల్లీ టూర్ లో వైసీపీ ఎన్డీయేలో చేరికకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. సీఎం జగన్ ఢిల్లీ టూర్ జరిగి పక్షం రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీతో భేటీ అంటే దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. ఇటీవలే ఎన్డీయే నుంచి ఎప్పటినుంచో భాగ్వస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ తప్పుకున్న విషయం తెలిసిందే. రాజకీయంగా వైసీపీ ఏపీలో బలమైన శక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైసీపీ చేర్చుకోవటం ద్వారా తమకు మిత్రపక్షాలకు కొదవేలేదనే బిజెపి చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది.
చూడాలి జగన్ పర్యటన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో. రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే వైసీపీ ఎన్డీయేలో చేరితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన గతంలో ఓ సారి బిజెపితో పొత్తు పెట్టుకుని బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకే అని అప్పట్లో ప్రకటించారు. మళ్ళీ సడన్ గా బిజెపితో జట్టు కలసి అమరావతి కోసమే అని ప్రకటించారు. తీరా చూస్తే అమరావతి విషయంలో కేంద్రం పాత్రేమీలేదని బిజెపి ఝలక్ ఇఛ్చింది జనసేనకు. ప్రత్యేక హోదా విషయంలో విభేదించి బయటకు వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అసలు ఇంత తొందరగా బిజెపితో కలవటమే చారిత్రక తప్పదం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే వైసీపీ ఎన్డీయే లో చేరితే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?.