రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు ప్రారంభం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు.
చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. ఈ కేసు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ స్టే వెకేట్ అయింది.