ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ పార్టీ లక్ష్యమని ఆరోపించారు. గురువారం సజ్జల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారని, కుట్రపూరితంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉందని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు.
హిందూ మతంపై విశ్వాసంతో కాదని, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. అత్యంత భక్తి భావంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని, ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారే అభాసుపాలయ్యారన్నారు. మోడీ గురించి పార్టీలో ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని, నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు.