దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ దెబ్బకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం కూడా ఆ దిశగా రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఇంత కాలం విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకుని ఏపీ సర్కారు బుధవారం నాడు మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి గురువారం నుంచి ఏపీలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు.
హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. జగన్‌తో భేటీ అనంతరం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.