చెడు చూపుకు మందు లేదు..జగన్ వ్యంగాస్త్రాలు

Update: 2020-02-18 08:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలులో ‘కంటి వెలుగు’ మూడవ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దీని కోసం 15,337 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు. రెండో దశలో పీహెచ్‌సీ, కమ్యూనిటీ సెంటర్లలో నాడు-నేడు. రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ చేపడతామన్నారు. రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయని, మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు తీసుకువస్తామన్నారు.

‘ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం. నర్సింగ్‌ కాలేజీలు కూడా పెంచుతాం. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్‌ లేడు అన్న పదం వినపడకూడదు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 56 లక్షల 88 వేల 420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి కళ్లజోళ్లు అందజేస్తారని వెల్లడించారు. చంద్రబాబునుద్దేశించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి పనులు చేస్తుంటే చంద్రబాబులాంటి వారికి కడుపు మంట ఉంటుందని ఎద్దేవా చేశారు. అసూయతో వచ్చే కడుపు మంటకు..చెడు దృష్టిికి కూడా చికిత్స లేదని విమర్శించారు.

 

 

Similar News