ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుకకు సంబంధించి సంచలన ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల వారీగా ఇసుకకు సంబంధించి రేటు కార్డును ప్రకటించాలన్నారు. ఈ రేటు కార్డును కూడా బుధ, గురువారాల్లో ఖరారు చేయాలని తెలిపారు. ఎవరైనా నిర్ధారించిన రేటు కార్డు కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే వారిపై పెనాల్టీ విధించటమే కాదు వారి వాహనాలను సీజ్ చేసి రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చేందుకు నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరపాలని ఆదేశించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80వేల టన్నులు ఉండేదన్నరు. వరదల కారణంగా, రీచ్‌లు మునిగిపోవటంతో డిమాండ్‌ను చేరుకోలేకపోయామని తెలిపారు. గత వారంరోజులుగా పరిస్థితి మెరుగు పడిందని తెలిపారు. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది. 137 నుంచి 180 వరకూ స్టాక్ పాయిట్లు పెంచాలని ఆదేశించారు.
ఇసుక వారోత్సవాల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీలను ఇన్‌ఛార్జీలు పెట్టామని, వారే స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్ పాయింట్లు ఉండాలి. దీనికి కేబినెట్ ఆమోదం కూడా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సూచించారు. ఇసుక కొరత తీరేంతవరకూ ఎవ్వరూడా సెలవులు తీసుకోకూడదని సీఎం ఆదేశించారు. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలి. వీడియో కెమెరాలు పెట్టాలి. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలన్నారు.