వైసీపీ నేతల ఇసుక దోపిడీ

Update: 2019-11-14 05:58 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు ఒక రోజు ఇసుక దీక్షకు కూర్చున్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ వల్లే రాష్ట్రంలో సమస్య వచ్చిందని ఆరోపించారు. దీని వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇసుక దొంగ రవాణా సీఎం జగన్ కు కన్పించటం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఓ మంత్రి సాక్ష్యాత్తూ తమ వాళ్ళే ఇసుక తరలిస్తున్నారని బహిరంగంగా చెప్పారన్నారు. ఎమ్మెల్యేలకు ఇసుక దోపిడీ లైసెన్స్ లు ఇచ్చారని ఆరోపించారు. అసత్యాలతో ఎల్లప్పుడూ మోసం చేయలేరనే విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. ‘ఈ సీఎంవి అవినీతికి దోహదం చేసే ఆలోచనలు.. ఇసుకతో దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చూస్తున్నారు .

లాంగ్‍మార్చ్ చేసిన పవన్‍పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మీపై, మీ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా? . చేతనైతే ఇసుక ఉచితంగా సరఫరా చేయండి. లేదంటే మేం చేతగానివాళ్లమని ప్రజలకు చెప్పండి. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల్లో కోరారు . ప్రజలు ఒకసారి అవకాశమిస్తే మరణశాసనం రాస్తున్నారు. ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఉచిత ఇసుక పాలసీ తప్ప మరొకటి లేదు. మా ఊరి ఇసుకపై మీ పెత్తనం ఎంటి?. అధికారం ఉందని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోక తప్పదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Similar News