‘కెసీఆర్ మాతో కలిస్తే మహాకూటమి వచ్చేదా?. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ నాయకులతో చేసిన వ్యాఖ్య. అంటే కాంగ్రెస్ కంటే ముందు తెలుగుదేశం అధినేత తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తుకు రెడీ అయిపోయారా?. కెసీఆర్ కాదన్న తర్వాతే ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారనే విషయం తేలిపోయింది. అంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అవకాశవాద రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆయన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. తొలుత టీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నం చేసినట్లు..దీని వెనక కొంత మంది మీడియా పెద్దలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసినట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ సడన్ గా అసెంబ్లీని రద్దు చేయటం, ఆ తర్వాత ఏకంగా 105 సీట్లను ప్రకటించటంతో అసలు టీఆర్ఎస్ తో పొత్తులకు ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు కు మిగిలిన ఏకైక పార్టీ కాంగ్రెసే. బిజెపికి గుడ్ బై చెప్పటంతో జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ సాయం కూడా అవసరం.
ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయని ప్రచారం సాగుతున్న తరుణంలో ఎన్ని విమర్శలు ఎదురైనా ఆ పార్టీతో పొత్తుకు ఓకే చెప్పేశారు. పైగా తెలంగాణలో చంద్రబాబుకు ‘ఓటుకు నోటు కేసు’ ఒకటి మెడపై కత్తిలా వేలాడుతూనే ఉంది. దాని వల్ల పెద్ద ఏదో జరుగుతుందని కాదు కానీ..ముఖ్యమంత్రిపై కేసు నమోదు అయితే అది పెద్ద అంశంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబునాయుడు టీడీపీ మూల సిద్ధాంతాలకు చెల్లుచీటి రాసి మరీ కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయిపోయారు. గతంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ప్రమాదంలో పడినప్పుడు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండి కాంగ్రెస్ ను రక్షించారు. దానికి కారణం అప్పుడు కిరణ్ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే జగన్ గెలుస్తాడనే భయయంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అవకాశవాద నిర్ణయాలు తీసుకోవటంలో చంద్రబాబు ను మించిన వారుండరు.