వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ జనసేనలో చేరారు. ఆయనతోపాటు తూర్పు గోదావరి జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) కూడా జనసేన కండువా కప్పుకున్నారు. వీరిద్దరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయటమే జనసేన ఆశయం అని పేర్కొన్నారు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసేవారికి అండగా ఉంటామన్నారు. తాను స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనసేన అనేది నా పార్టీ అని ఎప్పుడూ అనుకోనని..మనది..మనం అనే భావనలే ఉంటాయని పేర్కొన్నారు.
నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం..జీవోలు ఇస్తామంటే సరిపోదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని..వాటిని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు. అదే సమయంలో గురువారం నాడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో వాడ వాడకూ జనసేన జెండా కార్యక్రమం చేపట్టడంతోపాటు..పార్టీ విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికల్లో సీపీఎంతో కలసి పనిచేసే అంశంపై సెప్టెంబర్ 2న ఆ పార్టీ నేతలతో జనసేన కార్యాలయంలో పవన్ చర్చలు జరపనున్నారు.