తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన ఇప్పటికే రెండు ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేసుకుందా?. అంటే అవుననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. అమలాపురం బరి నుంచి పవన్ పార్టీ తరపున మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ ను దింపే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. సామాజిక అంశాల పరంగా చూస్తే హర్షకుమార్ ఈ సీటులో గెలుపు నల్లేరుపై నడక కాగలదని లెక్కలు వేసుకుంటున్నారు. జనసేన ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతంపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాధాన్యతా క్రమంలో పవన్ ఆయా ప్రాంతాల్లో...జిల్లాల్లో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అమలాపురం ఎంపీ సీటు ఖచ్చితంగా తమదే అవుతుందని జనసేన ధీమాగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యేగా ఆన్న ఆకుల సత్యానారాయణ కూడా త్వరలోనే జనసేన లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతే కాదు..రాజమండ్రి ఎంపీ బరిలో జనసేన తరపున ఆయన ఉంటారని చెబుతున్నారు. ఆర్థికంగా కూడా ఆకుల సత్యనారాయణ బలమైన అభ్యర్ధి కావటం, పవన్ ఇమేజ్ తోడు అవటం వల్ల రాజకీయంగా ఇది తమకు లాభిస్తుందనే లెక్కల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మధ్యలో విరామం ఇచ్చుకుంటూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. పనిలో పనిగా అభ్యర్ధుల ఎంపిక కూడా చాప కింద నీరులా కామ్ గా చేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు. ముందే చేరికలు..అభ్యర్ధుల విషయాలు బయటకు వస్తే...రాజకీయంగా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో చాలా విషయాలు బహిర్గతం కాకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు. జనసేన వర్గాల్లో మాత్రం ప్రస్తుతం ఈ రెండు పేర్లు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.