ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మరోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకోవటానికి రెడీ అయిపోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే వరకూ తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. మరి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్ధులను బరిలోకి దింపితే ఎన్నికలు అనివార్యం అవుతాయి. వాస్తవానికి ఆ పార్టీ బలం ప్రకారం రెండు సీట్లే వస్తాయి. కానీ మూడవ అభ్యర్థిని కూడా బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నెల7న నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మరి ఎన్నిక అనివార్యం అయితే మాత్రం వైసీపీ సభ్యులు సభకు హాజరు కావాల్సి ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన వైసీపీ వాటికి దూరంగా ఉండి..రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవటం కోసం సభకు వస్తే అది రాజకీయంగా ఆ పార్టీకి అత్మహత్యాసదృశ్యం అవుతుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఫిరాయింపుల పేరుతో ఓ సారి సెషన్ ను బహిష్కరించారు ఓకే.
ఓ వైపు ప్రత్యేక హోదా, రాజధాని అడుగు ముందుకు సాగకపోవటం, కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వంటి ఎన్నో కీలక అంశాలను పెట్టుకుని సభకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకోవటం ఇది ‘సెల్ఫ గోల్’ కంటే దారుణమైన అంశం అని ఓ నేత వ్యాఖ్యానించారు. సభకు వచ్చి కూడా ఫిరాయింపులపై పోరాడవచ్చని...ఒకే మోడల్ ఫాలో అవటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎంపీల రాజీనామా, పార్లమెంట్ లో అవిశ్వాసం వంటి అంశాల ద్వారా ఒకింత వాతావరణనాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని..కానీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవటం ద్వారా అది కాస్తా వికటించేలా చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే వైసీపీ సభ్యులు సభకు హాజరైతే..అధికార పార్టీ మరికొంత మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఆ పార్టీలో ఉందని ఓ నాయకుడు తెలిపారు. రాజ్యసభ సీటు వైసీపీకి దర్మబద్దంగా వచ్చేదే కావచ్చు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు సభకు రాకుండా..కేవలం తమ అభ్యర్థిని గెలిపించుకోవటానికి మాత్రం సభకు వస్తామంటే ప్రజలు హర్షిస్తారా?.