ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సెంటిమెంట్’ అస్త్రాలను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసినా అది ఏపీ ప్రజలపై దాడి...ఏపీ ప్రజలను అవమానించటం అంటూ గగ్గోలు పెడుతున్నారు?. తాను బలహీనపడితే..ఏపీ బలహీనపడుతుందని కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నారు. ఆయన బలహీనపడటానికి..తెలుగుదేశం బలహీనపడటానికి ఏపీ ప్రజలకు ఏమి సంబంధం?. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్లే గెలుస్తారు?. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖపై వివరణ ఇస్తూ కూడా చంద్రబాబు ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించపరుస్తూ..అవమానిస్తూ లేఖ రాశారు’ అని ఆరోపించారు. నిజానికి అందులో ఏపీ ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనే చెప్పారు తప్ప..ఎక్కడ ప్రజలను అవమానించింది లేదు. కానీ చంద్రబాబు వీటిని వక్రీకరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు ఇంకా ఖర్చు పెట్టని విషయం బహిరంగ రహస్యమే.
ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే చంద్రబాబుపై చేసే విమర్శలు ఏపీపై దాడి అయినట్లు అయితే...చంద్రబాబు అండ్ కో చేసే అవినీతికి కూడా ప్రజలు బాధ్యత వహించాలా?. పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం వరకూ, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి భూ గోల్ మాల్, వైజాగ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ స్కామ్, చివరకు టాయిలెట్ల డబ్బులను దోచుకున్న వైనం అధికార వర్గాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో చివరకు మొక్కల పేరుతోనూ కోట్ల రూపాయలు బొక్కేశారు. ఇక కాంట్రాక్టుల విషయంలో అయితే..అవినీతి వైఎస్ హయాంను మించి సాగిపోతుందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాలు అన్నింటికి కేబినెట్ సాక్షిగా ఆమోదముద్రలు వేయించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి చంద్రబాబునాయుడు అండ్ కో చేసే అవినీతికి కూడా ప్రజలు బాధ్యత వహించాలా?. ఆయనపై వచ్చే విమర్శలకు ప్రజలకు సంబంధం ఏమిటి?.