ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వైపు సోలార్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి)తో కుదిరిన ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం మోపుతుంది అని ఆరోపించారు. అయితే ప్రస్తుత విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ మాత్రం సెకితో ఒప్పందం ఒక ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు. దేశంలోని తొలిసారి గా సెకి తో ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. 30 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించాలనేది జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అని చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం విషయంలోనే అదానీ కంపెనీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి 1750 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చింది అనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
మరి సెకి ఒప్పందం విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది నిజామా...లేక విజయానంద్ చెప్పింది నిజమా?. అందుకే ఇప్పుడు అధికార వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు సెకి విజయానంద్ కే సిఎస్ పోస్ట్ ఇస్తారా..లేక మరొకరికి ఈ కీలక పోస్ట్ ఇస్తారా అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. సిఎస్ రేస్ లో విజయానంద్ తో పాటు సాయి ప్రసాద్, సిసోడియా తదితరులు రేస్ లో ఉన్నారు. అయితే గత కొంత కాలంగా సిఎస్ పోస్ట్ విజయానంద్ కే దక్కటం ఖాయం అనే ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో విస్తృతంగా ఉంది. అయితే సాయి ప్రసాద్ తో పాటు సిసోడియా కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే జాబితాలో అజయ్ జైన్ , అనంత్ రామ్ ల పేర్లు ఉన్నా కూడా వాళ్లకు స్కోప్ పరిమితంగానే ఉంది అని చెపుతున్నారు. అయితే ఫస్ట్ విజయానంద్ కు సిఎస్ పదవి ఇచ్చి తర్వాత సిసోడియా కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రచారం జరుగుతున్నట్లు చంద్రబాబు సిఎస్ పోస్ట్ కు విజయానంద్ ను ఎంపిక చేస్తే సెకి ఒప్పందాన్ని సమర్ధించటంతో పాటు జగన్ హయాంలో విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారు వంటి విమర్శలకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
మరో వైపు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు పీపీఏ లను రద్దు చేయగా..అది దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. జగన్ హయాంలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు మేలు చేకూర్చటంలో కూడా విజయానంద్ అప్పటి సీఎం జగన్ చెప్పిన ప్రకారమే చేశారు అనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయానంద్ తన పవర్ అంతా చూపించి చంద్రబాబు తో పాటు ఒక కీలక, పవర్ ఫుల్ మంత్రిని తన వైపు తిప్పుకున్నారు అని..అదే ఇప్పుడు ఆయన కు కీలక పోస్ట్ దక్కేలా చేయటంలో పనికివస్తోంది అనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. జగన్ పాలనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలతో సెటిల్మెంట్స్ జరిగాయి అనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. విజయానంద్ కు చంద్రబాబు సిఎస్ పోస్ట్ ఇస్తే జగన్ కు అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తికి కీలక స్థానం కట్టబెట్టినట్లు అవుతుంది అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.