మార్పు ఇదేనా!

Update: 2024-12-30 05:41 GMT

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా జగన్ మోహన్ రెడ్డి తరహాలోనే అతి మంచి తనం..అతి నిజాయతీ లక్షణాలు వచ్చినట్లు ఉన్నాయి. ఎందుకంటే గత కొంత కాలంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి సొంత పార్టీ నాయకులే అవాక్కు అవుతున్నారు. ఇందులో మచ్చుకు కొన్ని సానా సతీష్ కు రాజ్య సభ సీటు ఇవ్వటం..ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సిఎస్ గా కె. విజయానంద్ ను నియమించటం. సీనియర్లను కాదని జూనియర్లకు సిఎస్ పదవులు ఇచ్చిన ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం అది కాదు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కుదిరిన సెకి ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నాయకులు అంతా చెప్పుకుంటూ వచ్చారు.

                                                               ఈ ఒప్పందం కోసం అదానీ కంపెనీ నుంచి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపించారు. కానీ ఇదే సెకి ఒప్పందాన్ని చంద్రబాబు సిఎస్ గా నియమించిన విజయానంద్ ఒక ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు. దేశంలో అసలు ఇలాంటి ఒప్పందం ఎక్కడా జరగలేదు అంటూ గొప్పగా చెప్పారు. సహజంగా చంద్రబాబు యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన ఆలోచనలకూ భిన్నంగా ఉన్న వాళ్ళను దగ్గరకు కూడా చేరనీయరు. కానీ ఇప్పుడు ఏకంగా విజయానంద్ ను సిఎస్ చేశారు. ఇదే చంద్రబాబు జగన్ హయాంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది అని...విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. శ్వేత పత్రం లో కూడా ఇలాంటి విషయాలే ప్రస్తావించారు. జగన్ హయాంలో ట్రాన్స్ ఫార్మర్లు , స్మార్ట్ మీటర్ల కొనుగోలు, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి జరిగింది అంటూ లేటెస్ట్ గా టీడీపీ అధికారిక పేస్ బుక్ పేజీ లో కూడా పెట్టారు. మరి ఇదే విజయానంద్ గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖలోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఇన్ని ఆరోపణలు చేస్తూ కూడా విజయానంద్ ను సిఎస్ చేశారు అంటే పైకి కనిపించే వాటి కంటే కనిపించని కారణాలు ఎన్నో ఉన్నాయనే చర్చ టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది.

                                            జగన్ హయాంలో విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి అంటూ అదే శాఖలో పని చేసిన...అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి పూర్తి స్థాయిలో సహకరించిన అధికారిని అందలం ఎక్కించారు అంటే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధం అయింది అనే అభిప్రాయం కలగటం సహజం అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో కార్పొరేట్ శక్తుల ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది అనే...పలు విషయాలను వాళ్ళే

డిక్టేట్ చేస్తున్నారు అని చెపుతున్నారు. ఇందులో పలు పవర్ కంపెనీలు...పవర్ ఫుల్ కంపెనీలు ఉన్నాయని చెపుతున్నారు. ప్రభుత్వం ఏదైనా సరే తమకు కావాల్సిన పనులు చేయించుకోవటానికే వీళ్ళు చక్రం తిప్పుతున్నారు అని...అందుకే గత ఐదేళ్ల పాలనలో సాగిన అక్రమాలపై కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా వదిలేసారు అన్నది ఎక్కువ మంది చెప్పే మాట.

Tags:    

Similar News