తెలుగు దేశం పార్టీ కొత్తగా ఇచ్చిన ఒక రాజ్య సభ సీటు విషయం రాజకీయ, అధికార వర్గాల్లో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికి తెలిసిందే. ఎందుకంటే టీడీపీ నుంచి కొత్తగా రాజ్య సభ సీటు దక్కించుకున్న వ్యక్తికి ఉన్న ట్రాక్ రికార్డు అటు వంటిది మరి. సొంత పార్టీ క్యాడర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయంలో పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్ట్ లు పెట్టారు. మీడియా లో కూడా ఆయనపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే రాజ్య సభ సీటు ఖరారుకు ముందే అయన ఘన కార్యాలు..ఏ మంత్రి పేరు చెప్పి దందాలు నిర్వహిస్తున్నది ఒక పత్రిక ఫస్ట్ పేజీ లో పలు మార్లు వార్తలు రాసింది. అసలు ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళతో ప్రభుత్వంలోని పెద్దలు ఎలా స్నేహం చేస్తారు అంటూ ఆ వార్తల్లో ప్రశ్నలు సంధించింది.
అయినా సరే ప్రభుత్వంలోని వాళ్ళు కూడా ఏ మాత్రం స్పందించలేదు. కారణం అందరూ కలిసి అక్రమ దందాలు చేయటమే. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఎవరి మీద అయితే ఒక ప్రధాన పత్రిక వరసపెట్టి ప్రముఖంగా స్టోరీ లు రాసిందో ఆ పత్రిక అత్యంత వివాదాస్పద వ్యక్తికి టీడీపీ తరఫున రాజ్య సభ సభ్యత్వం ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా ...సింపుల్ గా మౌనంగా ఉండి పోయింది. తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పత్రికాధిపతితో ఆ వివాదాస్పద వ్యక్తి డీల్ సెట్ చేసుకున్నాడు అని. తొలి విడత ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి తర్వాత కూడా భారీ మొత్తం లో సర్దుబాటు చేయటానికి అంగీకరించినందునే ఆ పత్రిక అధినేత ఆ వివాదాస్పద రాజ్య సభ అభ్యర్థి ఎంపికపై మౌనం దాల్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే ఆ పత్రాధికాధిపతితో డీల్ కోసం ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల తరపున కిమ్ గా పిలవబడుతున్న వ్యక్తి వచ్చి నేరుగా మాట్లాడారు అని...తర్వాత ఆ వివాదాస్పద వ్యక్తితో కూడా మాట్లాడించి డీల్ సెట్ చేసినట్లు చెపుతున్నారు. అంటే పత్రికాధిపతులకు కోట్ల రూపాయలు సమర్పించుకుంటే ఎంతటి వివాదాస్పద వ్యక్తులకు అయినా..నేర చరిత్ర ఉన్న వాళ్లకు అయినా రాజ్య సభ తో పాటు ఎలాంటి పదవులు ఇచ్చినా మౌనంగా ఉంటారు అన్న మాట.
పైగా అప్పటి వరకు ఏ వ్యక్తిపై అయితే పేజీ లకు పేజీలు రాసి..అత్యంత కీలక సమయంలో మౌనం దాల్చటంతో ఈ గుట్టు బట్టబయలు అయింది. ఒక్క ఈ విషయంలోనే కాదు..కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పలు వివాదాస్పద నిర్ణయాల విషయంలో కూడా ఆ పత్రికాధినేత తీరు అలాగే ఉంది. జగన్ హయాంలో ముఖ్యంగా విద్యుత్ శాఖలో కొన్ని కంపెనీలకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు అని వార్తలు రాసి ....కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా వాళ్లపై ఎలాంటి యాక్షన్ లేకుండా సెటిల్మెంట్స్ చేసుకున్నా కూడా మౌనాన్ని ఆశ్రయించటంతో అన్ని చోట్లా సెటిల్మెంట్స్ రాజ్యం నడుస్తోంది అనే చర్చ సాగుతోంది.