ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార తెలుగు దేశం మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి అవినీతి పై పదే పదే విమర్శలు చేస్తుంది. కానీ యాక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అంతా జీరో. తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో పని చేసింది. జగన్ హయాంలో ట్రాన్స్ఫార్మర్స్ , స్మార్ట్ మీటర్ల లో అవినీతి, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి అంటూ తన అధికారిక పేస్ బుక్ పేజీలో పలు అంశాలు ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టింది. కొద్ది నెలల క్రితం కూడా ప్రకాశం బ్యారేజ్ కూల్చేసే కుట్ర జరిగింది అని...దీని వెనక ఉన్నది ఈ దుష్టచతుష్టయం అంటూ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామాకృష్ణా రెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురాం ల ఫోటో లతో ఇప్పటిలాగానే తన అధికారిక పేజీ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. కృష్ణా బ్యారేజ్ ను బోట్స్ తో ఢీకొట్టించి కూల్చేసే కుట్ర చేశారంటూ తీవ్రమైన అభియోగాలు మోపారు. కేవలం ఈ విషయంలో పేస్ బుక్ పోస్ట్ పెట్టి వదిలేశారు. అంటే కుట్ర చేసినా..విషయం తెలిసినా కూడా అధికార టీడీపీ ఏమి చేయలేక వదిలేసిందా?.
మరి ఇప్పుడు కొత్తగా చెపుతున్నట్లు జగన్ హయాంలో ట్రాన్స్ఫార్మర్స్ , స్మార్ట్ మీటర్ల లో అవినీతి జరిగి ఉంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు?. చేతిలో అధికారం ఉన్న వాళ్ళు తప్పు చేసిన వాళ్లపై యాక్షన్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా కేవలం పేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టి వదిలేస్తున్నారు అంటే దీని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండి తీరాలి. లేదంటే ఆ అవినీతిలో వాళ్ళు కూడా వాటాలు తీసుకుని ఉండాలి. అలాంటిది ఏమి లేకపోయినా కూడా అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వాళ్ళను వదిలేస్తున్నారు అంటే చేతకాని ప్రభుత్వం అనే విమర్శలను మూటకట్టుకోక తప్పదు. ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపుతోంది అని తాజాగా వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ లో నిరసనలు చేపట్టింది. వాస్తవానికి ఈ అదనపు భారం మొత్తం జగన్ పాలనా కాలానికి సంబంధించినదే..ఇందుకు ప్రతిపాదనలు పంపింది కూడా జగన్ హయాంలోనే. అయినా సరే రాజకీయ కోణంలో వైసీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
జగన్ హయాంలో సెకి తో కుదిరిన ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పిన టీడీపీ ఇప్పుడు ఆ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జగన్ కు 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపిస్తూ..ప్రజలకు లక్ష కోట్ల రూపాయల భారం తప్పదు అని చెపుతూ కూడా ముందుకు వెళుతున్నారు అంటే చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం జగన్ అవినీతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుందే తప్ప...అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రజలను రక్షించటానికి...వాళ్లపై భారం పడకుండా చూడటం కోసం కాదు అనే విషయం స్పష్టం అవుతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. టీడీపీ తన అధికారిక పేజీ లో పెట్టే పోస్ట్ లపై సొంత క్యాడర్ నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా కబుర్లు చెపుతారు..చేతనైతే యాక్షన్ తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది జరిగే పనేనా?. జగన్ ఐదేళ్ల పాలనలో సాగిన అవినీతి అంటూ నిత్యం పేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టడం తప్ప...ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా టీడీపీ సర్కారు యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు.