జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేస్తున్న భారీ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారొద్దని పవన్ కు రేవంత్ రెడ్డి సలహా ఇఛ్చారు. రైతులకు పగటి పూట విద్యుత్ ఇస్తే సరిపోతుందని..కానీ ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు మేలు చేసి..వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు దోచుకునేందుకే కెసీఆర్ ఈ ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇవేమి తెలియకుండా పవన్ కళ్యాణ్ రైతులకు విద్యుత్ సరఫరాపై కెసీఆర్ ను ప్రశంసించటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు. కేసీఆర్ మాటల మత్తులో ప్రజలను ముంచేందు కు పవన్ ఆయనకు సహకరించే విధంగా మాట్లాడారన్నారు. అప్పటి పరిస్థితి ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది వాస్తవమే అని....అది గమనించిన సోనియా విద్యుత్ ను వినియోగ ప్రాతిపాదికన విభజించిందని తెలిపారు. విద్యుత్ విషయం వచ్చేసరికి సోనియా తెలంగాణ కు 54శాతం కేటాయించారు. ఏపీకి 46 శాతం కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ గతంలో ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టు వల్లే నేడు మిగులు విద్యుత్ సాధ్యమైందని తెలిపారు.
తెలంగాణలోని 56 లక్షల రైతులు 24గంటల విద్యుత్ ను కోరుకోవటంలేదన్నారు. విద్యుత్ కు సంబంధించి పవన్ నిజాలు తెలుసుకోవాలంటే రఘు రాసిన పుస్తకాన్ని పవన్ చదవాలని..తమ ఇద్దరికీ ఉమ్మడి స్నేహితుడు ఉన్నాయని..ఆయన ద్వారా పుస్తకం ఆయనకు పంపుతానని తెలిపారు. కేసీఆర్ మూడేళ్ళలో అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదన్నారు. తెలంగాణ సొమ్మును కెసీఆర్ దోచుకుంటున్నారని..ఈ అంశంపై చర్చకు తాను రెడీ అని ప్రకటించారు. చర్చకు కెసీఆర్ వచ్చినా పర్లేదు..మంత్రులు వచ్చినా ఓకే అన్నారు. తెలంగాణాలో పరిస్థితి పై పవన్ కు అవగాహన లేనట్టుందని అన్నారు. పవన్ పై తమకు విస్వాసం ఉందని..లాలూచీకి పవన్ లొంగిపోతారని తాము అనుకోవటంలేదన్నారు.