టీఆర్ఎస్ లో ‘పవన్ కలకలం’

Update: 2018-01-02 11:07 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో పవన్ కళ్యాణ్ కలకలం మొదలైంది. పెద్ద పెద్ద లీడర్లకే దొరకని పార్టీ అధినేత, సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ పవన్ కళ్యాణ్ కు దొరకటంపై కొంత మంది నేతలు గుస్సాగా ఉన్నారు. అయితే వారెవరూ నోరుతెరకపోయినా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా నేత వసుంధర సోషల్ మీడియాలో ఈ భేటీపై ఫైర్ అయ్యారు. తన పేజీలో ఈ మేరకు పోస్టు చేశారు. ‘చిన్న జీవి పెద్ద జీవి అని ఆడిపోసుకుంటివి కదా ఇప్పుడు గిదేమి కథ సర్? ఇటువంటోలకోసమా తెలంగాణ సాధించుకుంది? ఇదేమి ఖర్మరా బాబు???? సంతన్న ఇలాంటోలకు జల్ది appointment fix చేస్తాడు..సంతన్న మొఖంలో సంబరం చూడండి...తెలంగాణ ఇచ్చినందుకు బాగ ఏడ్సినోడు ఇప్పుడు తెలంగాణలో పోటి చేస్తాడట పవనాలు....దానికి ఇదే ఆహ్వానము’ అంటూ ఆమె పోస్టు పెట్టారు. ఇదే అభిప్రాయం చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై కూడా గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. జాగృతి పేరుతో విదేశాల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారని..వీటికి లెక్కలు చెబుతారా? అని ప్రశ్నించారు.

దీనిపై అప్పట్లో కవితతోపాటు టీఆర్ఎస్ నేతలు కూడా పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ కూడా సోషల్ మీడియాలో ఎటాక్ మొదలుపెట్టింది. ఎన్నికల ముందు కెసీఆర్ ఆంధ్రా వాళ్లను ఎన్ని తిడుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని..సీమాంధ్ర పౌరుషం ఏమైంది జగన్ అని అప్పట్లో పవన్ ప్రశ్నించారు. అంతే కాదు..కెసీఆర్ నీ తాట తీస్తా అని ఓ బహిరంగ సభలో హెచ్చరించారు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కెసీఆర్ ప్రస్తుతం అధికారంలో ఉన్నందున ఏమి చేస్తున్నాడో చూడండి అంటూ కెసీఆర్ కు వంగి దండం పెడుతున్న ఫోటోను పెట్టి ‘ఎప్పుడు వాగాలో కాదు..ఎప్పుడు వంగాలో తెలిసినోడే ఫ్లవర్ స్టార్’ అని పోస్టింగ్ పెట్టారు.

 

Similar News