నూతన సంతవ్సరం తొలి రోజు ఓ రాజకీయ సంచలనం. తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అదీ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ బరిలోకి దిగుతుందని పలుమార్లు ప్రకటించినా...ఎప్పుడూ తెలంగాణలోని సమస్యలపై పెద్దగా స్పందించింది లేదు. ఏపీలోని సమస్యలపై కూడా అడపాదడపా స్పందించటం మినహా..అది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అకస్మికంగా తెలంగాణ సీఎం కెసీఆర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి బిజెపిని వదిలేసి...టీడీపీ, జనసేన కలసి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అకస్మికంగా తెలంగాణ సీఎం కెసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. పైకి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చెప్పటానికే కలిశారు అని ప్రచారం జరుగుతున్నా..ఈ భేటీ వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటానికి తనకు అనుభవంలేదని ఆయనంతట ఆయనే ప్రకటించుకుంటున్నారు. తెలంగాణతో పోలిస్తే జనసేన సత్తా కాస్తో కూస్తో ఉండేది ఏపీలోనే. అయితే సిని హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ లోనూ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఎంతలేదన్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి సవాల్ విసరనుంది. అందుకే సీఎం కెసీఆర్ ఏ అవకాశాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేరు. అందులో భాగంగానే అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతలేదన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపినా..ఆ ప్రభావం ఖచ్చితంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అధికారంలోకి రావాలని కలలుకంటున్న కాంగ్రెస్ పై చూపటం ఖాయంగా భావిస్తున్నారు. కెసీఆర్, పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన అంశాలు ఏమీ అధికారికంగా బయటకు రాలేదు. కానీ వీరి చర్చ రాజకీయ కోణంలోనే సాగిందని చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ పై విమర్శలు చేయటం..ప్రతిగా కెసీఆర్ కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మరి ఈ భేటీ అనంతరం తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయం ఎలా ఉండబోతున్నది వేచిచూడాల్సిందే.