ప్రశ్నించే పార్టీనే.. ఓ పెద్ద ప్రశ్న!

Update: 2018-01-02 03:59 GMT

జనసేన దారి తప్పుతుందా?. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని ప్రకటించిన ఈ ప్రశ్నించే పార్టీనే రాజకీయాల్లో ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోనుందా?. నిన్నటి వరకూ ఏపీలో తెలుగుదేశం సర్కారుతో ‘ఫ్రెండ్లీ మ్యాచ్’ ఆడుతూ తీవ్ర విమర్శలు మూటకట్టుకున్న జనసేన ఇప్పుడు తెలంగాణలోనూ అదే సీన్ ను రిపీట్ చేస్తోంది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాను ఎవరూ తప్పుపట్టాల్సిన పనిలేదు. అవసరం కూడా ఉండదు. అసలు పథకం ప్రారంభించిన రోజే పవన్ కళ్యాణ్ ఈ పథకం భేష్ అని ఎలా ప్రకటించగలరు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అమలులో ఎదురయ్యే కష్టనష్టాలు..డిస్కంల సంక్షోభం వంటి అంశాలను ఎలా విస్మరించగలరు?. పోనీ ఇవన్నీ వదిలేద్దాం కాసేపు...రెండు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని తెలంగాణలో కూడా పరిమిత సీట్లలోనే పోటీచేస్తారనుకుందాం. మరి తెలంగాణలో పోటీచేసే జనసేన అభ్యర్ధులు వచ్చే ఎన్నికల్లో ఏమని ఓట్లు అడగాలి?. ఎవరిపై పోరాడతారు. తమకు ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతారు. కెసీఆర్ పాలన తీరు భేష్ అని ప్రకటించిన తర్వాత జనసేన తెలంగాణ రాజకీయ పోరులో ఇక చెప్పటానికి ఏముంటుంది?. అసలు తెలంగాణలో జనసేన అవసరం ఏమి ఉంటుందనే ప్రశ్నలు ఉదయించటం సహజం.

పార్టీ పెట్టినప్పటి నుంచి ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమస్యలను గతంలోను ఎప్పుడూ పెద్దగా ప్రస్తావించింది లేదు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో చంద్రబాబుకు, తెలంగాణలో కెసీఆర్ కు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా కీలకంగా మారారు. పవన్ ఎలాగూ అక్కడ వైసీపికి వ్యతిరేకం..ఇక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకం. ఈ అంశాన్ని ఇద్దరు చంద్రులు విజయవంతంగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కనీసం ఒక్కో నియోజవర్గంలో పవన్ అభిమానుల ఓట్లు 2000 నుంచి 3000 ఓట్ల వరకూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువై ఉండొచ్చు. ఈ సంఖ్య ఎందుకంటే గెలుపును డిసైడ్ చేసే ఓట్లు ఇవి. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి యూత్ కు రాజకీయ అవకాశాలు కల్పించకుండా...ఉన్న పార్టీలకే వత్తాసు పలకటం వెనక మర్మమేమిటో పవన్ కళ్యాణే చెప్పాలి. కెసీఆర్, పవన్ భేటీపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలకు ముందు ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏయ్..కెసీఆర్ నీ తాట తీస్తా? అని వ్యాఖ్యానించగా..కెసీఆర్ దీనికి కౌంటర్ గా ఓ సభలో ఆడి..పేరేందిరా బై..అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాలను గుర్తుచేసిన వర్మ...అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అని వ్యాఖ్యానించారు.

 

Similar News