గత కొంత కాలంగా మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. ఈ సారి ఆయన మంత్రి కెటీఆర్ మామను టార్గెట్ చేశారు. వాస్తవానికి ఈ విషయం రేవంత్ రెడ్డి సోనియా జన్మదినోత్సవం అయిన డిసెంబర్ 9నే గాంధీభవన్ లో వెల్లడించాయి. అయితే ఈ వార్త ఎక్కడా ప్రముఖంగా వచ్చిన దాఖలాలు లేవు. దీంతో సోమవారం నాడు గాంధీభవన్ లో ఇదే అంశంపై మరోసారి మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ ఉద్యోగం పొందారని ఆరోపించారు. గిరిజనుడి అవకాశాలను కొల్లగొట్టిన ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్ పెంపుడు నేతలు కాదు.. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ స్పందించాలని అన్నారు.
ఎస్టీ సర్టిఫికెట్‌తో 35 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు చేయడంతోపాటు ఇప్పుడు పెన్షన్ కూడా కేటీఆర్ మామ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని సీఎం కేసీఆర్ ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు. దీనిపై తాను ఫిర్యాదు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్టీ పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజమని, ట్విట్టర్ లో పలికే కేటీఆర్ కు తన మామ చేసిన మోసం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వియ్యంకుడిని కాపాడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టులో ప్రభుత్వం బట్టలూడదీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వదిలిపెట్టబోదని హెచ్చరించారు.