ఓ పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయన మంగళవారం నాడు కోర్టు హాజరు కావాల్సి ఉన్నా కాలేదు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా..అందుకు కోర్టు అంగీకరించలేదు. ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. అయినా మంగళవారం నాడు నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు హాజరుకాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు ప్రచురించారంటూ.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో వేమూరి రాధాకృష్ణతో పాటు మరికొందరిపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
జగన్ ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవగా..ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టులో విచారణ సాగుతోంది.