రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్న కెసీఆర్

Update: 2017-12-22 08:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెఎల్పీ నేత కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చర్యలు దేశ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. గత ఏడాది తిరుపతిలో ఈ సమావేశాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఈ సారి సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాలకు సంబంధించిన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

అన్ని ఏర్పాట్లు చేసి ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇపుడు వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారంటూ ఇలాంటి సభలు నిర్వహించకపోవడం తెలంగాణకు అవమానం అని పేర్కొన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదని, ద్వేషపూరితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను కేసీఆర్ వాయిదా వేశారన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యార్థులతో బీజేపీ మాట్లాడుతుందని చెప్పారు.

 

Similar News