తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను గతంలో చేసిన వ్యాఖ్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సర్కారు భారీ ఎత్తున హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ తరుణంలో కెసీఆర్ గతంలో ‘తెలుగుతల్లి’పై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కెసీఆర్ కు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే అర్హత ఉందా? అంటూ కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ సమయంలో కెసీఆర్ ‘తెలుగుతల్లి దెయ్యమే’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆంధ్రమాత ఉండేదని..ఆ తర్వాత తెలుగుతల్లిని తీసుకొచ్చారని...అందువల్ల ఆంధ్రోళ్ళ తెలుగుతల్లి తెలంగాణ వారికి దెయ్యమే అని వ్యాఖ్యానించారు. అలాంటి కెసీఆర్ ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించటం..దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో కెసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కొంత మంది గుర్తుచేస్తున్నారు.
ఒక్క తెలుగు తల్లి అంశం ఒక్కటే కాదు..మెట్రో రైలు విషయంలోనూ కెసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టుపై ముందుకు వెళితే హైదరాబాద్ లో రక్తం ఏరులై పారుతుందని కెసీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అప్పటి ముఖ్యమంత్రులు ఎల్ అండ్ టి దగ్గర ముడుపులు తీసుకుని ఖరీదైన భూములను అప్పగించటంతో పాటు...తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ముందుగా..సుల్తాన్ బజార్ మీదుగా అసలు మెట్రో పోవటానికి వీలేలేదని..అలైన్ మెంట్ మార్చితీరుతామని ప్రకటించిన కెసీఆర్ పూర్తిగా ఈ అంశాలను వదిలేశారు. దీని వల్ల రెండేళ్ల సమయం వృధా కావటంతో పాటు ఖర్చు కూడా 4000 కోట్లు పెరిగిందని చెబుతున్నారు. మెట్రో విషయం వచ్చేసరికి అసలు అసెంబ్లీ అద్భుతంగా ఉంటుందని..దాని ఎలివేషన్ దెబ్బతీస్తారా? ప్రశ్నించారు. కానీ ఈ మధ్య సభ సాక్షిగా అసలు ఇదేమి అసెంబ్లీ..కార్లు పెట్టుకోవటానికి కనీసం పార్కింగ్ కూడా లేదని ప్రస్తుత అసెంబ్లీపై విమర్శలు చేశారు. కొంత మంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి.