డైరక్టర్ ను కాలుతో తన్నిన అదనపు డీసీపీ

Update: 2017-12-23 04:37 GMT

సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ ఫిర్యాదుపై కౌన్సిలింగ్ కు అని పిలిచి అనుచితంగా అతనిపై దాడి చేసిన ఘటన కలకలకం రేపుతోంది. ఎవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసు అంటూ మరో వైపు డైరక్టర్ ను కాలుతో తన్నిన వ్యవహారం దుమారం రేపుతోంది. మొత్తం మీద సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తన చర్యల ద్వారా వివాదంలో చిక్కుకున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని కాలుతో తన్నిన అంశం హల్ చల్ చేస్తున్న వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్‌ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.

కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అనంతరం గట్టిగా కేకలు వేస్తూ యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్‌ పేరుతో పీఎస్‌కు పిలిచి ఇలా చుక్కలు చూపించారు. అయితే స్టేషన్‌ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

 

 

Similar News