సహనం...సహనం..ఓపిక ..ఓపిక అంటూ వేచిచూస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ‘స్వేచ్చా గీతం’ పాడేందుకు రెడీ అవుతున్నారా?. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో ‘ప్రెషర్ కుక్కర్’ పేలనుందా?. అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇంత కాలం ఓపికపట్టిన నేతలు ఇక ‘బయట’పడేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ పార్టీల్లో లేని భిన్నమైన వాతావరణం టీఆర్ఎస్ లో నెలకొందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు మంత్రులతో పాటు...ఎమ్మెల్యేలు కూడా అధినేత కెసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కనీసం ఆయన చాలా మందికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదు. గతంలో ఏ రాజకీయ పార్టీలోనూ ఈ పరిస్థితి ఉండదు. ఉమ్మడి రాష్ట్రం సమయంలో ప్రతి ముఖ్యమంత్రి నగరంలో ఉంటే మధ్యాహ్నాం మూడు నుంచి ఐదు గంటల వరకూ ఎంపీలు..ఎమ్మెల్యేలు కలిసే ఛాన్స్ ఉండేది. ఈ సమయం కేవలం వారికే కేటాయించేవారు. ఆ సమయంలో వేరే అపాయింట్ మెంట్లు ఉండేవి కావు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పిలిస్తే వెళ్లి కలవటం సాధ్యం అవుతుంది తప్ప...ఎమ్మెల్యే, ఎంపీ తాను సొంతంగా కలవాలనుకుంటే అంత ఈజీకాదనే ఓ సీనియర్ నేత బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
కొంత మంది మినహా చాలా మంది మంత్రులకూ ఇంచుమించు అదే పరిస్థితి. మంత్రి సచివాలయంలో ఉన్నా....సీఎం నివాసం లేదా క్యాంప్ ఆఫీసులో ఆయన శాఖ సమీక్ష సాగిపోతుంటుంది. కానీ ఆయనకు మాత్రం సమాచారం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లో. రాజకీయపర అంశాలకు వస్తే ఎంత పెద్ద నేత అయినా ఆ పార్టీలో చేరేటప్పుడు ఉన్న హుషారు చేరిన తర్వాత ఏ మాత్రం కన్పించదని..తర్వాత అటు పార్టీ అధినేత కెసీఆర్, లేదా ఆయన తనయుడు మంత్రి కెటీఆర్ ను కలవటం కూడా గగనమే అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంత ఎందుకు కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగువెలిగిన కె. కేశవరావు, డీ. శ్రీనివాస్ ల దీ అదే పరిస్థితి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎర్రబెల్లి దయాకర్ దీ అదే పరిస్థితి. ఏ పార్టీ నుంచి అయినా సరే టీఆర్ఎస్ లో చేరేంత వరకూ బాగానే ఉంటుంది కానీ..చేరిన తర్వాత మాత్రం అక్కడ పట్టించుకునే వారు మాత్రం ఎవరూ ఉండరని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒత్తిడి అంతా ఉగ్గబట్టుకుని ఉన్న నేతలు అందరూ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కాస్త గాలిపీల్చుకునేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో పోట్ల నాగేశ్వరరావు ఇఫ్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. కొండా సురేఖ దంపతుల డిమాండ్ ఏమిటో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో స్పష్టం చేశారు. కొండా దంపతులు టీఆర్ఎస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. కొండా దంపతులు ప్రస్తుతానికి పార్టీ మార్పు వార్తలను ఖండిస్తున్నా..భవిష్యత్ లో ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సురేఖకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ లో ఏ మాత్రం సీటు గ్యారంటీ స్కీమ్ దొరికినా చాలు అధికార పార్టీ నుంచి జంప్ అయి రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది నేతలు వేచిచూస్తున్నారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అధికార పార్టీలో ‘కీలక పరిణామాలు’ చోటుచేసుకోవటం ఖాయం అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..