తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పూర్తి స్థాయి తాత్కాలిక డీజీపీగా వ్యవహరిస్తారు. ఆదివారం నాడు నూతన డీజీపీ బాధ్యతలు చేటప్టబోతున్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో సర్కారు కొత్త డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఆదివారం ఉదయం 9 గంటలకు పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ జరగనుంది. అనంతరం 11.30 గంటలకు మహేందర్‌రెడ్డి ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.